Wednesday, February 25, 2009

భారతీయులు స్వాభిమాన చింతనులేనా?


ఆస్కార్‌ అవార్డుల పంట పండిం దని సంబరపడుతున్నారే తప్ప, స్లమ్‌ డాగ్‌... టైటి ల్‌ భారతీయులందర్నీ కుక్కలుగా భావించి, అవమానించేదిగా ఉందని రాష్టప్రతి, ప్రధాని మొదలు రాజకీయ ప్రముఖులు దాకా గాని, సినిమా రంగ ప్రముఖులు మొదలు సామాన్య ప్రేక్షకుల వరకు గాని ఒక్క భారతీయురాలైనా, భారతీయుడైనా ఆలోచించకపోవటం మనమెంత భావదారిద్య్రంలో, భావ దాస్యంలో ఉన్నామో అర్థం కావటం లేదా? అద్దం పట్టడం లేదా? స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌ సినిమా భారత దేశంలోని మురికివాడల కథనాన్ని తెరకెక్కించింది. ఇది ఆహ్వానించదగినదే. మన దేశంలో అభివృద్ధి చెందిన నగరాల్లో. పట్టణాలన్నీ మురికి వాడలు, పేదల బస్తీలతోనే నిండి ఉన్నాయి. ఈ బస్తీలలో వ్యధాభరిత జీవితానుభవాలున్న వారందరూ మేధావులే. ప్రతియువతీ, ప్రతి యువకుడూ బస్తీ మేధావే. ఇలాంటి మేధావులని... డాగ్‌... గా, స్లమ్‌ డాగ్‌...గా కించపరిచే టైటిల్‌ పెట్టి ప్రచారం చేస్తూ, కాసుల వ్యాపారం చెయ్యటం సాంఘి క నేరం కాదా? సాంస్కృతిక నేరం కాదా? అగ్రరాజ్య సాంస్కృతిక ఆధిపత్యానికి బుద్ధిలేకుండా జై కొట్టడం కాదా?

ఇంతకీ బస్తీ కుక్క ఎవరు? హీరోనా? భారత దేశంలోని మురికి వాడల వాసులందరూనా? భారతీయ ప్రేక్షకులందరూనా? భారతీయ రచయిత రాసిన `క్యూ అండ్‌ ఏ' నవల శీర్షికను `బస్తీ కుక్క కరోడ్‌పతి'గా చిత్రీకరించటం పునర్ముద్రణకు సిద్ధం కావటం వెనక ఉన్న ఉద్దేశ్యాలేమిటి? చూస్తూ ఉండగానే జేబులు లూఠీ చెయ్యటమా? భారతీయుల వేళ్ళతోనే వారి కళ్ళను, మనసులను పొడిపించి నొప్పించడమా? మన మహానగరాల పాలకులు వలస పాలకులు పెట్టిపోయిన వీధి పేర్లనే పూర్తిగా తొలగించుకోలేకపోయారు! ఎవరో పెట్టిన సినిమా టైటిల్‌ని ఏం మార్చగలం అని అనుకుంటున్నామా? ఇలాగని సరిపెట్టుకుందామా? సాంస్కృతిక సామ్రాజ్యవాదాన్ని ప్రశ్నిం చకుండా బతుకుదామా?

ప్రశ్నలకి సమాధానాలు సరిగ్గా చెప్పే కురక్రారంతా కుక్కలెలా అవుతారు? వలసవాద, జాత్యహంకార సినిమా పెట్టుబడి సడెన్‌గా ఈ సినిమాకి ఇన్ని ఆస్కార్‌ అవార్డులో ఎందుకిచ్చింది? వందకోట్ల పై చిలుకు ప్రేక్షకుల మార్కెట్‌ పై లాభాల వల విసిరేందుకు కాదా? భారతీయ మురికివాడలంటే దళితులు, ఆది వాసులు, అణగారిన సామాజిక వర్గాల ప్రజలు నివసించే ప్రాంతాలే. ఇలాంటి వర్గాల ఇతివృత్తం కలిగిన ఈ సినిమాకి ఆస్కార్‌ అవార్డులు అందుకున్నది మాత్రం పైకులాల సినిమా నిపుణులే కావటం విచిత్రం, విషాదం. మురికివాడల్లో నివసించే వాళ్ళు కేవలం కుక్కలేనా? మనుషులు కారా? ఈ సినిమా టైటిల్‌ తెల్లజాతి దురహంకారానికి, వారి తొత్తులైన భారతీయ ఆధిపత్య కులాల సినిమా వ్యాపారులందరి దురహంకారానికి నిదర్శనం కాదా?

వందేళ్ళ సినిమా చరిత్ర కలిగిన ఇండియన్‌ సినిమాలో ఎన్నో గొప్ప సినిమాలున్నాయి. ఇవి ఆస్కార్‌ అవార్డుల కమిటీ కళ్ళకు ఆనవా? రంగ్‌ దె బసంత్‌, లగాన్‌, భగత్సింగ్‌ పై తీసిన సినిమాలు, ఇళయరాజా లాంటి సంగీత రాజాలను ఆస్కార్‌ అవార్డుల కమిటీ చూడదా? (రెహమాన్‌కి, బస్తీ కుక్క...ల సినిమా బృందానికి ఆస్కార్‌ అవార్డులు ఇవ్వొద్దని కాదు) ఇప్పుడే, ఇలాంటి ఇండియన్‌ `బస్తీ కుక్క ...'లకే అవార్డులు ఎందుకు కురిపిస్తున్నట్లు? ఇండియన్‌ ప్రేక్షకులందరూ తమని అవమానించే టైటిళ్ళతో భవిష్యత్తులోనూ రాబోయే సినిమాలను సైతం చప్పట్లు, కేరింతలతో వెర్రివారై... కుక్క...లై చూడాలనా? అగ్ర రాజ్యాల నగరాల్లోని మురికివాడల ప్రజలకి ఇలాంటి కుక్క పేర్లు తగిలించి ఎవరైనా సినిమాలు తియ్యగలరా? అలా తీస్తే ఊరుకోం కదా? వివక్షలకు వ్యతిరేకంగా భారతీయులు ఎవరైనా సినిమాలు తీస్తే, ఆర్టు సినిమాలుగా ముద్రవేసి కలెక్షన్ల దగ్గర కుప్ప కూల్చేయడం సినిమా వ్యాపారానికి పాత విషయమే కాని, అగ్ర రాజ్యాల్లో ఉండేవారు ఇలాంటి సినిమాలు తీస్తే, ఇండియన్‌ మీడియా విశేషమైన ప్రచారాన్ని ఎందుకు కల్పిస్తోంది? ఇది సిగ్గుచేటు అంశం కాదా? ఒక విదేశీ సాంస్కృతిక సామ్రాజ్యావాద సినిమాని ఇండియన్‌ ప్రేక్షకులు ఎగబడి చూసే వారిగా ప్రభావితం చెయ్యటం పెట్టుబడి మీడియాకి న్యాయ సమ్మతం కాదు. ఏది ఏమైనా, ఈ సినిమా టైటిల్‌ భారతీయులందరి ఆత్మాభిమానాన్ని అవమానించేదిగా ఉంది. పోరాడి ఈ టైటిల్‌ని మార్చుకోక పోతిమా, దేశమే కుక్కగా మారిపోయే ప్రమాదముంది జాగ్రత్త!

- కృపాకర్‌ మాదిగ, జూపాక సుభద్ర

( సుర్య దినపత్రిక 26-2-2009 సౌజన్యంతో)

Friday, February 20, 2009

సాహిత్య యాజమాన్యాలను నిలదీస్తున్న అస్తిత్వ విమర్శ


అభిమానులకు విజ్ణప్తి

మాదిగ సాహిత్యంపై పరిశోధనలు, పుస్తక ముద్రణలు సీరియస్ గా విస్తృతంగా జరుపుతున్నాం. ఆంధ్రప్రదేశ్ జనాభాలో ఏకైక, అత్యధిక (పది శాతం) జనాభాతో మాదిగ కులం ఉంది. అందుకని ’సింహభాగం జనాభా మాది.సింహభాగం తెలుగు సాహిత్యమూ మాదే ’అని నిరూపించేదిశగా మాదిగ సాహిత్యం వెలువడుతుంది. ఒక ఉధ్యమంగా జరుగుతున్న మా కృషికి ఆర్థిక, హార్థిక సహకారాన్ని అందించ వలసినదిగా మాదిగ సాహిత్యాభిమానులను కోరుతున్నాము.

Thursday, February 12, 2009

మాదిగ డైరెక్టరీ కోసం విఙ్ఞప్తి!

మాదిగ డైరెక్టరీని అచ్చు వెయ్యదలిచాం. మాదిగ విద్యావేత్తలు, రచయితలు, కవులు, జర్నలిస్టులు, సాంకేతిక నిపుణులు, శిల్పం, చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ,గానం, చిందు, క్రీడలు, వాయిద్యం, వృత్తి కళ ( చెప్పులు కుట్టుట)మొదలైన అంశాలలో ప్రవేశమున్న మాదిగలు వారి విద్య, పరిశోధన, అనుభవం, పొందిన అవార్డులు, సన్మానాలు,ముద్రిత, అముద్రిత గ్రంథాలు అడ్రసు, ఫోను/సెల్ నంబర్లు , ఇ-మెయిల్ ఐడి, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో జతపరిచి ఈ కింది ఇ-మెయిల్ కి గానీ, లేదా కింది చిరునామాకి గానీ పంపగలరు.
krupakarmadiga@gmail.com

Address:

Krupakar Madiga
13-6-462/A/27
Bhagavandas Bagh,
Tallagadda, Hyderabad-500067
A.P., India